14.12.16

నేను మీకు తెలుసా ? ........ శ్వేత

నేను మీకు తెలుసా ? ........ శ్వేత

నేనెవరో తెలియాలంటే
ప్రశాంతంగా సాంతం చదవండి

భాష రాదు నాకు - అందరినీ పలుకరిస్తా
కళ్ళు లేవు నాకు - అందమైన ప్రకృతిని చూస్తా

చెవులు లేవు నాకు - అందరికీ వినిపిస్తా
నోరు లేదు నాకు - నా మాటనే తూటాలా పేలుస్తా

కాళ్ళు లేవు నాకు - అందరి దగ్గరకు నే వెళతా
చేతులు లేవు నాకు - అందరిచేతా రాయిస్తా

మాట రాదు నాకు - అన్ని భాషలు నే పలికి(కే)స్తా
పాట రాదు నాకు - అందరితో పాడిస్తా
అక్కున చేర్చుకున్న వారిని అందలమెక్కిస్తా

అందరిలో నేనుంటా
అందరిచేతా భావాలొలికిస్తా

ఉరకలువేసే హృదిలో నేనుంటా
మరులుగొలిపే మదిలో నేనుంటా

బావల భావాల్లో నేనుంటా
భామల ఊహల్లో నేనుంటా

అక్షరాల అమరికలో నేనుంటా
పదాల పొందికలో నేనుంటా
కలాల కదలికలో నేనుంటా

ఆకతాయిల ఆలోచనల్లో నేనుంటా
ఆవేశపూరిత అక్షరాల్లో నేనుంటా

ప్రేమికుల హృదయాలలో నేనుంటా
విరాగుల గీతికల్లో నేనుంటా

పండితుల పదాల్లో నేనుంటా
పామరుల గుండెల్లో నేనుంటా

అందరిలో నేనుంటా
అందరినీ స్నేహంగా కలుపుతుంటా

నన్నుచూసి మురుస్తారు కొందరు
నన్నుచూసి ఏడుస్తారు మరికొందరు

ఇంతకీ నేనెవరో తెలిసిందా ?
నేనేనండీ మీ మనోభావాలకి మరో రూపాన్ని
మీ  అందమైన ....... "కవిత"ని  ............ 14 Dec 2016No comments:

Post a Comment