22.4.13

శ్వేత.....నా సిరిమల్లీ

శ్వేత.....నా సిరిమల్లీ

ఎంతందంగా ఉందే నీ అలక
ఎందుకొచ్చెనే అలక ఓ నా సిలక !

నువ్వట్టా మాటాడక కూకుంటే నాకెట్టాగో ఉన్నాదే
నీ కొంటె సూపుతో --నా మనసు రంజింప సేయవే

సెట్టాపట్టాలేసుకుని --పంటపొలమంతా పరుగెడదామే
అట్టా మూతి ముడిస్తే --నీ మనసెట్టాగే తెలిసేది?
నువ్విట్టా బదులియ్యకుంటే--నిన్నెట్టాగే గెలిసేది?

నాటుకోడి తెచ్చి ఇత్తునే --కోపాలు సాలించవే
పట్టుకోక కొనిస్తనే --పలుకైనా పలుకవే
ఎటేటి కావాలో --నాకేటి సమజౌద్ది?

నోరిప్పకుంటే--నాకేటి తెలిసుద్ది?
పడమటి కొండపైకి సూరీడు సేరుకున్నాడే

సందమావ ఆ పక్కన కనబడుతున్నాడే
నీ అలక చాలించి --నా ముద్దు చెల్లించవే
నా మీద దయ సూపి --నీ అక్కున చేర్చుకోవే... 20-04-13


ఆనందాల ఉగాది

శ్వేత.......ఆనందాల ఉగాది

వసంతబాల విచ్చేసిన వేళ 
 మల్లెలు విరబూసిన వేళ
 
కోకిల గొంతెత్తి పాడిన వేళ
మావి చిగురులు తొడిగిన వేళ
 
అందరి మనసులు మురిసిన వేళ
ఇంటింటా ఆనందాల హేల
 
విజయోత్సాహాల విజయ వసంతం విచ్చేసిన వేళ....11-04-13

శ్వేత......అల్లరిపిల్లను నేనే

శ్వేత......అల్లరిపిల్లను నేనే

ఆగడాలు ఆపయ్యా
అందరిలాంటి దాన్ని నే కానయ్యా

అలుసుగా సూడమాకయ్యా
అభాసుపాలు అవబోకయ్యా

పొగరుబోతు నాయాళ్ళకు
పోట్లగిత్తను నేనయ్యా

నాకు పోటీ లేరెవ్వరు
నాకు సాటి రారెవ్వరు 

నా జోలికొస్తే తిప్పలే
నా దారికొస్తే దెబ్బలే 

ఎదురొస్తే ఎముకలు విరిచేస్తా
ఎక్కిరిస్తే సుక్కలు లెక్కబెట్టిస్తా 

ఆకతాయి కుర్రాళ్ళను ఆటాడిస్తా
పొగరుబొతు కుర్రాళ్ళను పరుగులేట్టిస్తా 

అచ్చమైన తెలుగింటి ఆడబిడ్డను నేను
ఆడపిల్లలందరికి ఆదర్శం నేను 

అమ్మాయిని నేనని అలుసు చేస్తే
అడవి సింగమై అణచేస్తా.........05-04-2013


శ్వేత...... మల్లెలు

శ్వేత...... మల్లెలు


మల్లెలు మల్లెలు మల్లెలు

మగువల మనసులు దోచే మల్లెలు 


వలపు పరిమళాలు వెదజల్లే మల్లెలు

తలపు తమకాలు పెంచే మల్లెలు


మగనిని మురిపించే మల్లెలు

ప్రియుని కవ్వించే మల్లెలు 


చెలి కొప్పుల సింగారాలే ఈ మల్లెలు

చిరు నవ్వుల వయ్యారాలే ఈ మల్లెలు...29-03-13



శ్వేత......ఒంటరి బ్రతుకు

శ్వేత......ఒంటరి బ్రతుకు

ప్రపంచమంతా ఏకమైనా
నా వెన్నంటే ఉన్నా

నా విజయాలని మెచ్చినా
నను అందలమెక్కించినా
నేనెన్ని సన్మాన సత్కారములు పొందినా 

నేను కోరిన నీవు
నా చెంత లేనప్పుడు 

నను మెచ్చనపుడు
నాతో లేనపుడు 

నా విజయాలని నీవు చూడలేనపుడు
ఇవన్నీ నా కంటికి శూన్యమే (సున్నా) కదా!...24-03-14


శ్వేత........మల్లి మనసు

శ్వేత........మల్లి మనసు

ఎన్నాళ్ళని ఎదురు సూడనురా మావా
నను మనువాడ తొందరగా రావా 

మనువాడి నను బస్తీ(వైజాగు)కి అట్టుకెళ్ళర మావా
నాకు బస్తీ అంతా సూపించర మావా

అల్లిపురమెల్లి అద్దమట్టుకోస్తానంటివే
కంచరపాలమెల్లి కాటుకట్టుకోస్తానంటివే

పాతగాజువాకెల్లి పౌడరట్టుకోస్తానంటివే
కురుపామరుకేట్టుకెల్లి కాలి అందెలు తెస్తానంటివే

ఎన్నాళ్ళని ఎదురు సూడనురా మావా
నను మనువాడ తొందరగా రావా 

గోపాలపట్టణమెల్లి గాజులు కొంటానంటివే
కనకమాలచ్చిమి దర్శనం సేయించి కొత్తకోక కొంటానంటివే
 
కైలాసగిరికెల్లి తిరిగోద్దామంటివే
సముద్రం కాడకు పోయి సరసమాడదా మంటివే 
సిమ్మాద్రి అప్పన్న కాడున్న సంపెంగలు తెస్తా నంటివే 

ఇట్టాంటి బాసలు ఎన్నెన్నో సేసినావురా
ఎన్నాళ్ళని ఎదురు సూడనురా మావా 
 
నను మనువాడ తొందరగా రావా
తొందరగా రావాలిరా మావా,
నను మనువాడి బస్తీ(వైజాగ్) సూపించరా మావా...19-03-13


వంటకాల పెళ్ళి

వంటకాల పెళ్ళి

పాయసం అనే ఊరిలో, 'కోవా' అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు 'బాదుషా'. అతని కుమార్తె పేరు 'గులాబ్ జామ్'. ఆ రైతుకు పులిహొర అనే పొలం ఉండేది. పనిలో సాయం చేయటానికి దద్దోజనం అనే సేవకుడుండేవాడు. ప్రయాణం చేయటానికి మినపట్టు, పెసరట్టు, అనే రెండు గుర్రాలుండేవి. వీరితో జిలేబి అనే ఇంట్లో ఆ రైతు నివసిస్తూ ఉండేవాడు....

ఒకనాడు ఆ ఊరికి వడ, ఆవడ అనే ఇద్దరు దొంగలు వచ్చారు. వారు గులాబ్ జామ్ అందాన్ని గూర్చి తెలుసుకొని,కోవా ఇంట్లో లేని సమయం చూసి, దొంగలు కారప్పూస అనే తాడుతో బంధించి తెసుకొని వెళ్ళారు.. ఈ సంగతి తెలుసుకొన్న కోవా తన సేవకుడైన దద్దోజనంతో, మినపట్టు- పెసరట్టు గుర్రాలనేసుకొని, వెతకటానికి బయలుదేరాడు....

దారిలో వారికి నూనె అను నది దాటవలసి వచ్చింది. వారు అప్పడాలు అనెడి పడవ ఎక్కి, జంతికలు అనే తెడ్లతో ఆవలి వడ్డుకు చేరారు.. వారికి ఒకచోట గులాబ్ జామ్ బంధించినట్లు తెలిసింది.. వారు వెంటనే ఆ ఊరి రాజైన పకోడీ గారికి ఫిర్యాదు చేసారు.. పకోడిగారు మంత్రి ఐన లడ్డుని, సేనాధిపతి అయిన మైసూరుపాక్ ని, పిలచి, వడ -ఆవడ లను బంధించి మరణశిక్ష విధించమని ఆజ్ఞాపించాడు... సేనాపతి మైసూరుపాక్ తలారి అయిన సున్నుండను పిలుచుకెళ్ళి, పూతరేకులు అనెడి కత్తులతో వారి తలలు తీయించాడు..

కోవా తన కుమార్తె అయిన గులాబ్ జామ్ ను తీసుకోని రాజైన పకోడిగారి వద్ద సెలవు తీసుకోవటానికి వెళ్ళాడు.. పకోడిగారు గులాబ్ జామ్ అందాన్ని చూసి ఆమెకు తన కుమారుడయిన కేసరిని ఇచ్చి పెళ్ళిచేయ సంకల్పించి తన ఉద్దేశాన్ని కోవాకి తెలిపాడు.. కోవా ఆనందానికి అవధులు లేవు. తన కుమార్తెను యువరాజు కేసరికి ఇవ్వటానికి అంగీకరించాడు.. రాజు వెంటనే పెండ్లికి కావలసిన ఏర్పాట్లు చేయండని బజ్జీలు అనెడి సేవకులకు ఆజ్ఞాపించాడు...

పకోడిగారు ఒక ముహుర్తాన్న చపాతి అనే పందిరి వేసి, అరిసెలు అను మండపము కట్టి, కాజాలు & చాకోడిలు అను వాయిద్యాలతో కేసరి & గులాబ్ జామ్ లకు అతి వైభవముగా పెండ్లి జరిపించారు.....

(ఈ కధ జాబిల్లి అనే పత్రికలో 1980 లో వచ్చింది.... దీనిని నేను ఇష్టపడి దాచుకున్నాను..... ఇప్పుడు మీ అందరితో ఈ హాస్య కధని పంచుకుందామని రాసాను)

శ్వేత.......నాలాగాఎందరో

శ్వేత.......నాలాగాఎందరో

తినడానికి తిండి లేదు
ఉండటానికిల్లులేదు 

కట్టడానికి బట్ట లేదు
బతకాలన్న ఆశలేదు

కన్నవారు కాలం చేసారు
కట్టుకున్నోడు ఒదిలేసాడు 
కన్నబిడ్డలు రోడ్డుపాల్చేసేసారు 

బిచ్చమెత్తి బతకలేను
కూలిసేయ ఓపికలేదు 

గారవించేవారు లేరు
ఆదరించువారసలు లేరు 
 
నిలువ నీడనిచ్చేవారు కానరారు
బతకలేక భారంగా ఇంకా ఎన్నాళ్లీ బతుకు బండినీడ్చను? 
 
ఈ అవనిలో నేనొక అభాగ్య వనితను.
ఇంకా ఈ(మన)దేశంలో నాలాగా ఎందరో....08 MAR 13...



14.4.13

llశ్వేతll మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

ఓ వనితలారా కదలిరండి, తరలిరండి

ఓ వనితలారా కదలిరండి, తరలిరండి
కదలి జగతిని మేల్కొలపండి

అణకువగా ఉంటూనే తెలివిగా మసలండి
మూఢనమ్మకాలొదలండి...తార్కికంగా ఆలోచించండి.

వెనుతిరిగి చూడకండి...మనకెదురులేదని చెప్పండి
ఎదురొచ్చిన ఆటంకాలను అధిగమించి అందలమెక్కండి 

భావిపౌరులని తీర్చిదిద్ది.
భరతావని కీర్తి పెంచండి

మీ లక్ష్యాన్ని సాధించువరకు 
మీకు అలుపన్నది లేకుండ
ముందంజ వేస్తూ సాగిపోండి

శ్రమించండి సాగిపొండి
చరిత్రలో నిల్చిపొండి....08 MAR 13