6.2.13

శ్వేత...||ఎన్నాళ్ళీ కన్నీళ్ళు||

ఎన్నాళ్ళీ కన్నీళ్ళు 

నీ పిలుపు విననిదే నా చెవులకు ఆనందం లేదే...
నిను చూడనిదే నాకు కళ్ళకి సంతోషం రాదే...
నీవు నా దగ్గర లేకుంటే నాకు ధైర్యము లేదే

నిను పిలవకుంటే నా పెదవులకు ఏమీ తోచదే...
ఎన్నాళ్లని ఈ ఎదురుచూపులు నీ కోసం

ఈ గుండె మంటలార్పడానికి
ఎన్ని కన్నీళ్ళు కార్చాలి

ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు ఈ కన్నీళ్ళు
కన్నీళ్ళతో తడిసి తడిసి ముద్దవుతోంది మనసు... శ్వేత..06 FEB 13





















4.2.13

శ్వేత ||కవ్వించకే చెలీ ||

కవ్వించకే చెలీ

నిండు పున్నమి పండు వెన్నెలలో
జాజిమల్లెల పందిరి క్రింద
సోకింది విరజాజుల సువాసన కమ్మగా
వచ్చినది ఎవరో నా చెంతగా
పసిగట్టె నా మనసు అది నిన్నుగా
తెల్ల మబ్బు చీరను కట్టి
ముంజేతికి నీ జడను చుట్టి
నీ వాల్చుపుల కన్నులతో
నన్ను కవ్వించకే చెలీ
హృదయ భారము పెంచకె.......02/01/2013



నాయుడుబావ

నాయుడుబావ

సేటలోన రూకల్ని నేనేరబోతుంటే 
రూకల్లోన నా మావ మోము అగుపించే, 

బిందట్టుకెళ్లి సెరువుకాడ నే నీళ్ళాడబోతుంటే
సెట్టు సాటు నుంచి తొంగి సూస్తాడే నా మావ,

జొన్నకంకి సేలోన కంకుల్ని నేనేరబోతుంటే
కొంగట్టుకు లాగ్తడే నా కొంటె మావ,

నింగిలోన రేరాజు తొంగి సుస్తావుంటే
దోబూచులాడేటి నా మావ గుర్తుకొస్తుండు,

ఎన్న ముద్దంటి మనసున్న నా మావ
సందె పొద్దులకాడ నను చేర్త(కలుస్తా)నన్నడే,

అందరిలాంటోడు కాడు, బంగారు నా మావ
మనసున్న మారాజు, అందాల నా మావ    12-01-2013



llశ్వేతాll....శ్వేచ్ఛావిహంగం.

llశ్వేతాll....శ్వేచ్ఛావిహంగం.

వినీలాకాశంలో విహంగంలా 
స్వేచ్చగా ఎగురుతా...
బంధాలు లేని ప్రపంచంలోకి...
ఆంక్షలు లేని చోటుకి 
కట్టుబాట్లు లేని ప్రాంతానికి
వలస వెళ్ళిపోతా...
అక్కడే ఉండిపోతా...19 JAN 2013



బుజ్జాయి

బుజ్జాయి

బుడి బుడి అడుగుల బుజ్జాయి 
చకుముకి పాటల చెల్లాయి

జిలిబిలి పలుకులు పలుకమ్మ
ముసిముసి నవ్వులు రువ్వమ్మ

పడిపడి నవ్వులు నవ్వమ్మ
చిలిపిగ అల్లరి చెయ్యమ్మ

వడివడి అడుగులు వేయకమ్మా
సడిసడి అంతా చెయ్యమ్మా

ఆడుదామా మనము చెమ్మచెక్క
అందరం కలసి మెలసి ఎంచక్కా.......22 JAN 13


ప్రేమే ద్వేషమా?

ప్రేమే ద్వేషమా?

ప్రేమించడమే తెలిసిన నా హృదయానికి 
ద్వేషించడం నేర్పావు నీవు

వలదు వలదని విలపిస్తున్నా
నన్నొదిలి నీవు వెళ్ళిపోయావు

నన్నుకాదని వదలి వెళ్ళిన
నిన్నెలా నే ప్రేమించటం?

ఇన్నాళ్ళు నా చిత్తంలోనే దాచాను నిన్ను
కాని ఆ చిత్తాన్నే చిద్రం చెసావీనాడు

వికసిస్తున్న మన స్నేహ కుసుమాన్ని
నిర్దాక్షిణ్యంగా తుంచేసావు నీవు...

నీవిపుడు నా దరికి చేరుతానన్నా
నా హృదయంలో చోటులేదంటాను నేను
నీ నీడ కూడా తాకరాదంటాను నేను....21 JAN 13...

విధి వంచిత

విధి వంచిత 

నన్నోడించేవారు లేరు
మాటల్లో గెలవలేరు 
ఆటలలో గెలవలేరు

అల్లరిలో గెలవలేరు
అదృష్టంలో గెలవలేరు

నాదంలో గెలవలేరు
వాదంలో గెలవలేరు
అని విర్రవీగా ఇన్నాళ్ళు.

విధి వక్రించి, నను వెక్కిరించి,
నేనోడి తా గెలిచి,
తన చేతిలో నన్ను చేసింది బందీని
విగతనై జీవిస్తున్నా...

తెలుసుకో సత్యాన్ని..
గెలుపోటములు మన చేతిలోలేవనీ
విర్రవీగాడలసలే వద్దనీ...
విధి చేతిలో అంతా కీలుబొమ్మలం....
చెప్పినట్లాడే తోలుబోమ్మలం...24 JAN 13...... 


ఓ నా చిట్టితల్లి

చిట్టితల్లి 

కడుపార నీకు పాలు పట్టంగ 
మనసారా నిను లాలింపంగా

తనువంతా నిను ముద్దాడంగ
నీ నవ్వులతో నను నేను మరచిపోవంగ

నీ చేష్టలతో నన్ను కట్టి పడేయ్యంగా
నీ బుడి-బుడి నడకలతో నన్ను అలరింపంగా

నీ బోసి నవ్వులే నాకు కోటి దీపాలు
నీ చిలక పలుకులే నాకు ముత్యాల మూటలు

నీకేమని ఎన్నని తెలుపనే
నా మనసంతా నీవేనని
నాలో నేనిక లేనేలేనని...23 JAN 13


ఏమిసేతురా మావా.

ఏమిసేతురా మావా...... ఏమీ సేతురా !

ఏమిసేతురా మావా...... ఏమీ సేతురా 

ఎద పులకించి నేను-నర్తించ బోతుంటే 
నెమలమ్మ నను జూసి -నవ్విందిరా ఓ మావా! llఏమిll

గుంభనంగా నేను- గంతులేస్తా వుంటే
లేడి పిల్ల నను జూసి- లే పొమ్మన్నదిరా మావా! llఏమిll

యాదొచ్చి నువు నాకు -ఖత్ నే రాయబోతుంటే
కంగారులో కలము పాళీ విరిగిపోయినాదిర మావా ! llఏమిll

సెరువుకాడకు నేను -తానమాడబోతుంటే
సేరువులోన సేప పిల్ల -ఛి ఫో అందిర మావా ! llఏమిll

పేమతో నేను నీకు -పేమ లేఖ రాయబోతుంటే
పేమ పావురం వచ్చి-పట్టు కెళ్ళి పోనాదిర మావా ! llఏమిll

కమ కమ్మని ఓ కవిత -నే రాయ బోతుంటే
కలువపూలు నను జూసి కన్ను గీటినాయిర మావా ! llఏమిll

గొంతెత్తి నే నొక్క -కూని రాగం తీస్త వుంటే
కోకిలమ్మేమ్మో -నన్ను కసురు కున్నాదిరా మావా ! llఏమిll

కాకి సేత నీకు -కబురంపుదామంటే
కాకేమో తన అందం -నాకు లేదన్నాదిర మావా ! llఏమిll

బువ్వ తిందామని నేను- అవ్వ కాడికి బోతే
బువ్వ నేదు గువ్వా నేదు -అని అవ్వ కసిరేసినాదిర మావా ! llఏమిll

ఒంగ తోట కాడ నిను -ఒంటరిగా కలుద్దామని వస్తే
తొంగి సూసీ నీవు -నన్నొడిసి పట్టేసినావురా మావా ! llఏమిll
25 JAN 13


ఒంటరి పయనం

ఒంటరి పయనం 

చేతిలోన చెయ్యివేసి బాస చేసితివానాడు
ఆ చేతిని విదిలించి దూరమయ్యావీనాడు

తిరిగిరాని లోకాలకి పయనమయ్యావు నీవు 
కనుల చూతామన్నా కానరాకున్నావు నీవు

నిన్నొదిలి నేను ఉండలేనన్నావు.... నీవు.... ఆనాడు
నిన్నొదిలి ఒంటరినయ్యాను.... నేను..... ఈనాడు

ఎపుడు తీరునో నా ఈ హృదయభారం
ఎన్నాళ్ళో నా ఈ ఒంటరి పయనం

ఒక్కమారు కానరావా !
నను నీలో ఐక్యం చేసుకోవా!...25 JAN 13..



ఆకతాయికుర్రాళ్ళు

కొంటె కుర్రాళ్ళు 

తలకి నీలోసుకుని కురులార బెడుతుంటే 
కన్ను గీటి పోయాడే కాలనీ కుర్రాడు

పెద్ద నుయ్యి కాడ- నీళ్ళు నే తేబోతే
పైటట్టుకు లాగాడే పోకిరి పిల్లోడు

జామ తోట కాడ-జాగింగు చేయబోతే
జోరుగా ఈలేసొకడు జాజిమల్లెలిచ్చాడు

సెరుకు తోటకి ఎరువెయ్య నేబోతే
సెయ్యట్టుకు లాగాడే సాంబయ్యొకడు

రామన్న గుడికి నే నెళ్ళ బోతుంటే
రేతిరికి రమన్నాడే రాలుగాయొకడు

చాకిరేవుకాడకి నేనెళ్ళ బోతుంటే
చస్తనన్నడొకడు మనువాడక పొతే 

అబ్బబ్బ నే జెప్ప జాలలేకున్నానే
ఈ ఆకతాయి కుర్రాళ్ళ ఆగడాలు...

(ఓ కొంటె పల్లెపడుచు భావాలని అక్షర రూపంలో మీకు అందించే చిన్న ప్రయత్నం)
27 Jan 13



llశ్వేతll......నేనొంటరిని.....

నేనొంటరిని 

నడి సంద్రంలో ఉన్న వానికి 
గుక్కెడంత మంచి నీరు కరువైనట్లు........ 

జన సంద్రంలో ఉన్న నాకు
గుప్పెడంత ప్రేమ కరువై నేనొంటరి నైతిని...... 28 JAN 13


బంగారు మావా

రారోయి బంగారు మావా

రారోయి బంగారు మావా 
రారోయి బంగారు మావా

ఏడు మల్లెలెత్తు నీ మల్లి యంటివే
ఏడు మూరల మల్లెలైన నీవు తేలేకపోతివే llరారోయి ll

పక్కూరి పొలములోకి నను రమ్మని పిలిసి నావు
పొలముకాడకు నేనొత్తె నువు పలక కుంటివే ll రారోయి ll

గుత్తి వంకాయ కూర నేనొoడి ఉంచినాను
గంతులేస్తా వచ్చి తినిపోర నా మావా llరారోయి ll 

కాడెడ్ల బండి నీకు నేనివ్వబోతే
కాలి అందెలు నాకు నువ్వివ్వ జూస్తివే llరారోయిll 

సందెపొద్దులకాడ నువ్వొస్తా నంటివే
నీ రాకకోసం నేనెదురు సూస్తా ఉంటినే llరారోయిll 

ఎన్నాళ్లని ఎదురు చూడనోయి
నా దరి జేరి మనువాడ వోయి ll రారోయిll 29 JAN 13



శ్వేతమయం ...... శ్వేత

శ్వేతమయం ...... శ్వేత

శ్వేత నామం నాదండోయ్
శ్వేత వర్ణం నాదండోయ్

మల్లె మనసు నాదండోయ్
పలుకు నాది స్వచ్ఛమండోయ్

సూరీడన్న వెలుగును నేనే
జాబిలమ్మ వెన్నెలను నేనే

సప్తవర్ణాలున్నవి నాలోనే
సప్తసాగరాలులో ఉండేది నేనే 

జాజి మల్లెల తెల్లదనం నాది
విశాలమైన హృదయం నాది......31 JAn 2013